కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు కోల్పోయాం : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై మరోసారి ఘాటుగా ట్వీట్ సంధించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నీరు చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్లంతా నానా రకాలుగా మాట్లాడారని.. కానీ ఈ రోజు ఇదే కార్యక్రమానికి దేశమంతా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు చంద్రబాబు. మా పాలనలో సమర్ధ నీటి నిర్వహణ వల్ల నీతి ఆయోగ్ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు ఇచ్చిందన్న ఆయన.. కేవలం ఒక పాయింటు దూరంలో మొదటి ర్యాంకు కోల్పోయిందన్నారు.
మరి వైసీపీ సంగతేంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ 3 నెల్లోనే కృష్ణా, గోదావరి వరదల్లో 4 జిల్లాల్లో వేలాది కోట్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరమన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇదంతా జరిగిందన్న చంద్రబాబు..టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు అదే తేడా అని చెప్పారు. విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇక ప్రభుత్వాలెందుకు? అని వైసీపీపై విరుచుకుపడ్డారు.
హుద్ హుద్ తుఫాన్‌లో 240 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలతో విశాఖ వణికింది. తిత్లి తుఫాన్‌లో 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడింది. ఈ రెండు తుఫాన్ల సమయంలో ముందస్తు చర్యలతో ప్రజలను అప్రమత్తం చేశామని గుర్తు చేశారు టీడీపీ అధినేత. గంటల వ్యవధిలోనే పునరావస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నామన్నారు. వేలాది మందికి ప్రతి రోజు భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాలను పంపిణీ చేశాం. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించాం. విరిగి పడిన స్తంభాలను పునరుద్ధరించాం. ఆ స్ఫూర్తి ఇప్పుడీ కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైంది? వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com