పొంచి ఉన్న 'ఉగ్ర' ముప్పు.. రాష్ట్రాలకు నిఘా వర్గాల హెచ్చరిక

పలు రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు చొరబడినట్టు సమాచారం అందడంతో ఎక్కడిక్కడ అధికారులు అలర్ట్ అయ్యారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటికే తమిళనాడులో ఉగ్రదాడికి కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల సమాచారం మేరుకు పోలీసులు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.
ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రవేశించారని నిఘావర్గాలు సమాచారం అందించింది. వీరిలో ఒకరు పాకిస్తానీయుడు కాగా, మరో ఐదుగురు శ్రీలంకకు చెందిన వారుగా అధికారులు పేర్కొంటున్నారు. రాజధాని చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రాంతాలను అధికారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అప్రమత్తంగా వుండాలని తీర ప్రాంత జిల్లాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడుతో సహా కేరళ రాష్ట్రాలలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు ఖాదర్ రహీం అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఖదర్ రహీం కేరళలోని కొడంగలూరు వాసిగా గుర్తించారు. ఖాదర్ రహీం వెంటవున్న మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఖాదర్ రహీం రెండురోజుల క్రితం బహ్రెయిన్ నుంచి కొచ్చి వచ్చినట్లు సమాచారం. నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదులు చొరబడే అవకాశాలున్నాయనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గుజరాత్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో రెండు పాక్ బోట్లను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. అవి మత్స్యకారుల బోట్లేనని నిర్ధారించారు. ఇక ఉగ్రవాదులకు సహకారం అందించినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురిని తమిళనాడులోని కోవైలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయమై కేరళలో వ్యాపారవేత్త అబ్దుల్ ఖాదర్ రహీంపై ఎన్‌ఐఏ లుకౌట్ నోటీసు జారీచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com