సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌ను మలుపు తిప్పిన జైట్లీ

సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌ను మలుపు తిప్పిన  జైట్లీ

రాజకీయంగానే కాదు.. క్రికెట్‌లోనూ ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌ను మలుపు తిప్పారు జైట్లీ. భారత క్రికెట్‌లో డాషింగ్‌ డైనమిక్‌గా పేరుపొందిన సెహ్వాగ్, టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ కెరీర్‌ ముందుకు సాగడంలో అరుణ్‌ జైట్లీ కృషి ఎంతో ఉంది. అటు రాజకీయాల్లో కొనసాగుతూనే..ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు జైట్లీ. 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. ఆ సమయంలో ఎందరో ప్రతిభ ఉన్న ఢిల్లీ క్రికెట్ ప్లేయర్లకు భారత జట్టులో స్థానం దక్కేలా చూడగలిగారు.

అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడి కాక ముందు టీమిండియాలో ఢిల్లీ నుంచి ప్లేయర్లు తక్కువ శాతం ఉండేవారు. అయితే, జైట్లీ వచ్చాక సీన్‌ మొత్తం మారిపోయింది. సెహ్వాగ్ లాంటి ప్రతిభ కలిగిన ఎందరికో భారతజట్టులో స్థానం దక్కేలా కృషి చేశారు. తాను భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించడంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారని సాక్షాత్తూ సెహ్వాగ్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడమే కాకుండా, ప్లేయర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించేవారని సెహ్వాగ్ చెప్పారు. జైట్లీ మృతి బాధకలిగించిందన్నారు. సెహ్వాగ్ ఒక్కడే కాదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్ లాంటి ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఆయన ప్రొత్సహించారు.

ఇక ఢిల్లీ క్రికెట్‌ అభివృద్దికి జైట్లీ ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్రంగా కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరుణ్‌ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story