ఘనంగా తీజ్ బంజారా ఉత్సవాలు

ఘనంగా తీజ్ బంజారా ఉత్సవాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు జరుపుకునే పండుగలు వేటికవే ప్రత్యేకతను చాటుతున్నాయి. సంప్రదాయాలు, ఆచారాలు వారి పండగలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. కాలం మారుతున్నా.. సంస్కృతికి విలువనిస్తూ వారు జరుపుకునే వేడుకలు ప్రత్యేకత చాటుతాయి. ఇదే కోవలో తీజ్ ఉత్సవాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.

లంబాడాలు దసరా తీజ్‌ హోలీ పండుగలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. యువతులు తమకు మంచి వరుడు రావాలని దైవాన్ని కోరుతూ భక్తీ శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. తొమ్మిది రోజులు అత్యంత నిష్టగా ఉపవాసాలు చేస్తారు. ఆకుకూరలు, సజ్జల రొట్టెలతో ఒకే పూట ఆహారం తీసుకుంటూ పూజలు చేస్తారు. పండుగలో భాగంగా తొలుత పుట్ట మన్ను తీసుకొచ్చి వెదురు బుట్టలో దాన్ని వేసి అందులో గోదుమ మొలకలు పెంచుతారు. ఇవి ఎంత పచ్చగా ఉంటే భవిష్యత్్‌లో అంత ఆయురోగ్యాలు సంతోషాలు కలుగుతాయని నమ్మకం. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఉయ్యాల ఊగడం తీజ్‌ పండుగలో ఓ సంప్రదాయం.

తీజ్‌ ఉత్సవాలు గ్రామపెద్ద ఇంటి ముందు నిర్వహించడం సంప్రదాయం. రాఖీ పౌర్ణమి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. చక్కని దుస్తులతో, యువతుల ఆటపాటలతో తొమ్మిది రోజులు తండాలు కొత్త కళ సంతరించుకుంటాయి. తామ అలికిన గోధుమ బుట్టలకు పసుపు నీరు చల్లుతూ తొమ్మిది రోజులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. 8వరోజు దమ్‌బోలి పండుగ నిర్వహిస్తారు. ఆరోజు ప్రతి ఇంటి నుంచి బియ్యం బెల్లం సేకరించి తీజ్‌ బుట్టల వద్ద ఉంచుతారు. అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తారు.

చివరరోజైన తొమ్మిదవ రోజు బుట్టల నుంచి మొలకలను వేరు చేసి పురుషుల తలపై పెడతారు. వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దేవుని వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మొలకలను సమీపంలోని బావులు, చెరువుల వద్దకు భాజా భజంత్రీల నడుమ పాటలు పాడుతూ తీసుకెళ్తారు. అక్కడే వాటిని నిమజ్జనం చేసి వెంట తెచ్చుకున్న రొట్టెలు ఆకుకూరలను ఆరగిస్తారు. యువతుల సోదరులు నీటితో వారి పాదాలు కడి నమస్కారాలు చేయడంతో తీజ్‌ పండుగ ముస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story