మలిదశ పోరాటానికి సిద్ధమవుతున్న పసుపు,ఎర్రజొన్న రైతులు

నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ఉద్యమం నిర్వహించిన రైతులు ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మూకుమ్మడిగా పోటీచేశారు. 170 మంది రైతులు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం కల్పించారు.
ఎన్నికలు ముగిసిన తరువాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు భావించారు. కానీ పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటన ఇంత వరకు జరగలేదు. అంతేకాకుండా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పంటలు చేతికి వచ్చిన సమయంలోనే ఆందోళనలను నిర్వహించడం, ఆ సమయంలో ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా పంటలను తక్కువ ధరకైనా విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. పంటలు చేతికి రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని రైతులు ఆలోచిస్తున్నారు. అందువల్ల కార్యాచరణను రూపొందించి ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తే ప్రభుత్వం కదిలివచ్చి తమ పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలోనే పసుపు, ఎర్రజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలోనే ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని కదిలించాలని రైతులు భావిస్తున్నారు. ఇవాళ నిర్వహించే సమావేశానికి అన్ని గ్రామాల నుంచి రైతులు రాజకీయ పార్టీలకు అతీతంగానే హాజరుకావాలని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com