రాజధానిని పూర్తిగా తరలిస్తారా? లేక కుదిస్తారా?

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి పైనే చర్చ. రాజధానిని పూర్తిగా తరలిస్తారా? లేక కుదిస్తారా? కేపిటల్‌ను దొనకొండలో ఏర్పాటు చేస్తారా ఇలా రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. అటు మంత్రులు తలోరకంగా చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి అమరావతి మార్పు తప్పదనే సంకేతాలైతే స్పష్టంగా ఇస్తోంది ప్రభుత్వం.
అమరావతిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు బొత్స. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదన్నారు. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. 8 లక్షల క్యూసెక్కులకే అమరావతి ముంపునకు గురైందని.. 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరావతి విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్ధాన్ని తలపిస్తున్నాయన్నారు.
మంత్రి బొత్స మాటలకు విలువ లేదని.. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అమరావతిని మార్చాలన్నా, ఉంచాలన్నా, చంపేయాలన్నా అంతా జగన్ చేతిలోనే ఉందన్నారు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి జగన్ ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలాగే వేధిస్తే.. రాష్ట్రంలో ఒక్క వైసీపీ కార్యకర్త అయినా మిగిలేవారా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.
బొత్స వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన కామెంట్లు చేశారు..ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులుగా ఉంటాయని తెలిపారు. ఇది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా కేపిటల్ అమరావతిలోనే ఉంటుందని చెప్తుంటే.. ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం మేరకు ఏపీలో నాలుగు కేపిటల్స్ ఉంటాయంటూ కలకలం రేపారు.
అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఈ అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
మరోవైపు మంత్రి బొత్స వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు.. వెలగపూడిలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించి బొత్సకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని కోసం వేల ఎకరాలను త్యాగం చేస్తే ఇప్పుడు తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అమరావతి మార్పుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగని మార్పు వార్తలను ఖండించనూ లేదు. దీంతో రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర అందోలన వ్యక్త మవుతోంది. కేపిటల్‌ను మార్చొద్దంటూ వారంతా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com