టీమిండియా విజయ దుందుభి.. రహానె సెంచరీ..
టీ20లు, వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ టీమిండియా విజయ దుందుభి మోగిస్తోంది.. వెస్టిండీస్ టూర్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది.. తొలి టెస్టును కైవసం చేసుకుంది టీమిండియా.. రహానె సెంచరీతోపాటు బుమ్రా విజృంభించడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగులతో చిత్తు చేసింది. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా ఏడు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయగా.. ఇషాంత్ మూడు వికెట్లు, షమీ రెండు వికెట్లు తీశారు.. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ పేకమేడలా కూలింది.
3 వికెట్లకు 185 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే దెబ్బ తగిలింది. ఓవర్‌నైట్ స్కోరు వద్దే కోహ్లీ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు కోహ్లీ, రహానె 106 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, రహానె.. విహారి అండతో ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసిన రహానెను గాబ్రియెల్ అవుట్ చేయడంతో ఐదవ వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానెకు తోడు హనుమ విహారి (93) అర్ధ శతకంతో రాణించడంతో ఆదివారమైన నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 112.3 ఓవర్లకు 343/7 వద్ద డిక్లేర్ చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు బుమ్రా దెబ్బకు వణికింది. టీ విరామానికి 5వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత హోప్, హోల్డర్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఛేజ్ , గాబ్రియెల్‌ను షమి వెనక్కు పంపాడు. చివర్లో రోచ్ కొంతసేపు ప్రతిఘటించినా విజయం టీమిండియానే వరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com