మీ పాత ఫోన్‌ని సీసీ కెమెరాగా మార్చేయొచ్చు.. ఎలా అంటే..

మీ పాత ఫోన్‌ని సీసీ కెమెరాగా మార్చేయొచ్చు.. ఎలా అంటే..

పాత ఫోన్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది. పడేయాలనిపించట్లేదు కానీ మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ మరిన్ని ఫీచర్లతో ఆకర్షించేస్తోంది. అందుకే తప్పట్లేదు. పాతదాన్ని ఇంట్లో ఓ మూల.. దాని స్థానంలో కొత్త ఫోన్ జేబులోకి. అయితే పాత ఫోన్ పనికి రాదని అనుకోవడానికి లేదు. పనిచేస్తుంటే హ్యాపీగా మరోదానికి ఉపయోగించొచ్చు. ఈ పాత ఫోన్లను ఇంటికి సెక్యూరిటీ కెమెరాలుగా మార్చేయొచ్చు. బేబీ మానిటర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. దానికి ఏం చేయాలో చూద్దాం..

ఆ ఫోన్లో ముందుగా సెక్యూరిటీ కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇందులో మోషన్ డిటెక్షన్, అలర్ట్స్, రికార్డింగ్, లోకల్ స్టోరేజ్, రిమోట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఒకసారి యాప్‌ను సెట్ చేసుకుంటే మీరు మీ ఇంటిని ఎక్కడినుంచైనా మానిటర్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం వాడుతున్న కొత్త ఫోన్‌లో నుంచి కూడా సెక్యూరిటీ కామ్‌ను నియంత్రించవచ్చు. 'ఆల్‌ఫ్రెడ్' యాప్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో అలర్ట్స్ పొందొచ్చు. ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం కూడా ఈ యాప్ ద్వారా లభిస్తుంది. ఫ్రంట్, రియర్ కెమెరాల సహాయంతో ఆడియో ఫీడ్‌ను పొందొచ్చు. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేపిన తరువాత స్టార్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత వ్యూయర్‌లోకి వెళ్లి నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది.

పాతఫోన్లో కూడా ఇదే పద్దతిని అనుసరించాలి. అయితే వ్యూయర్ ఆప్షన్‌కు బదులు కెమెరా ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటే కొత్తఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ ఆన్ లేదా ఆఫ్ వంటి మార్పులు చేసుకోవచ్చు. కెమెరా లేదా వ్యూయర్ పేరు, నమ్మకమైన వ్యక్తులను యాడ్ చేసుకోవచ్చు. కెమెరా ఎన్ని సార్లు డిస్‌కనెక్ట్ అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా అదనపు ఫీచర్లు కావాలంటే ప్రీమియం వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది.

ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక దాన్ని ఎక్కడ ఉంచాలి అనేది నిర్ధారించుకుని అక్కడ అమర్చాలి. పాత ఫోన్లు రెండు మూడు వుంటే కూడా వాటిని రెండు మూడు ప్రదేశాల్లో అమర్చి అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా చేసుకోవచ్చు. ఫోన్‌కు అవసరమైన పవర్ నిరంతరాయంగా అందేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మైక్రో యూఎస్‌బి కేబుల్ సహాయంతో 24/7 పవర్ అందేలా చూడొచ్చు. ఫోన్‌కి వైడ్ యాంగిల్ లెన్స్ వుండవు కాబట్టి వాటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి అమర్చుకోవచ్చు. దీంతో మీరు లేనప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీ కళ్లతో స్వయంగా చూడొచ్చు. సీక్రెట్.. ఫోన్ అమర్చిన విషయం ఎవరికీ చెప్పొద్దు.

Tags

Next Story