'అమెజాన్' కోసం హీరో భారీ సాయం.. రూ.36 కోట్లు విరాళం

పర్యావరణాన్ని కాపాడుకుందాం. అడవుల్ని రక్షించుకుందాం. అమెజాన్ అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే ప్రతి ఒక్కరు గొంతెత్తి నినదించారు. ఆచరణలో చూపాడు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో. గత ఏడాది జులైలో ఎర్త్ అలయన్స్ పర్యావరణ ఫౌండేషన్ స్థాపించిన ఆయన దీని ద్వారా 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్లు లియోనార్డో ప్రకటించారు. భూగ్రహం మీద లభించే 20 శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల ద్వారానే లభిస్తుంది. పచ్చని చెట్లన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అడవి జంతువుల ఆర్తనాదాలు ఎగసి పడుతున్న మంటల్లో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలని పలువురు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. లియోనార్డో తాను సాయం చేస్తూ ప్రతి ఒక్కరిని తమ వంతు సాయం చేయమని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోరుతున్నారు. విరాళంగా ఇచ్చిన ప్రతి రూపాయిని అమెజాన్ సంరక్షణకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం alliance.org/amazonfound వెబ్‌సైట్ చూడమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com