తేజస్విని చెప్పేది వినకుండా..

ఖమ్మం జిల్లా లంకపల్లి గుట్టల్లో విద్యార్థిని తేజస్వి హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారమే తేజస్విని నితిన్‌ హత్యచేశాడని నిర్ధారణ అయింది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకుడు.. పథకం ప్రకారం గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించడం సంచలనంగా మారింది. తేజస్వి మృతదేహం సమీపంలో రెండు లీటర్ల పెట్రోల్ సీసా దొరకడంతో నితిన్‌ అంతా వ్యూహం ప్రకారమే చేసి ఉండవచ్చని పోలీసులు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్రోల్ వాడిన దాఖలాలు మాత్రం లేవు. టీవీ 5 ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసిన వీడియోలో నితిన్ తేజస్విని గొంతు పిసికి చంపినట్లు చెప్పాడు. బహుశా మృతదేహాన్ని దగ్ధం చేయాలని బావించి వీలుకాక నితిన్‌ వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

తనను ప్రేమిస్తూనే వేరే అబ్బాయితోనూ చనువుగా మాట్లాడుతోందన్న అనుమానంతో యువతిని దారుణంగా హత్య చేశాడు నితిన్‌. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తేజస్వినిని చంపేశాక తనకేమీ తెలియనట్టు హాస్టల్‌కి వెళ్లిపోయిన నితిన్.. చివరికి తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. పెనుబల్లి మండలం కూపెనకుంట్ల గ్రామంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. తేజస్విని- నితిన్‌ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి గతంలోనే వారిని మందలించారు. ఐతే.. ఆదివారం తనతో మాట్లాడాలని పిలిచిన నితిన్ పథకం ప్రకారం హత్య చేశాడు. ముందుగా కొత్త లంకపల్లి గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తేజస్విని చెప్పేది వినకుండా పగతో రగిలిపోయి దారుణానికి ఒడిగట్టాడు.

పెనుబల్లిలో డిప్లొమా చదివేప్పటి నుంచే ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. డిప్లమా పూర్తయ్యాక ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నితిన్. తనను మోసం చేస్తుందని అనుమానంతో పగ పెంచుకుని ప్రేమించిన యువతి ప్రాణం తీశాడు. ఈ కుర్రాడిపై డ్రగ్స్ కొనుగోలు చేసిన కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఒకట్రెండు రోజుల్లో పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. సత్తుపల్లి ప్రాంతంలో యువత మత్తుపదార్థాలకు బానిసైన విషయాన్ని ఇప్పటికే టీవీ5 వెలుగులోకి తెచ్చింది. తల్లిదండ్రులు, స్థానిక వ్యాపారుల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఇవాళ ఉన్మాదిగా మారి అమాకురాలైన తేజస్వినిని నితిన్‌ హత్య చేశాడంటే.. ఈ ఘటనల వెనుక డ్రగ్స్ కోణం కూడా ఉండొచ్చన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.ఖమ్మం జిల్లా లంకపల్లి గుట్టల్లో విద్యార్థిని తేజస్వి హత్య ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story