అమిత్‌షాతో జగన్ భేటీ

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జగన్.. ఆ తర్వాత అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు నిధులను ఇవ్వాలని కోరారు. అమిత్‌షాతో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమైన జగన్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
అనంతరం కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులపై చర్చించారు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు.. అలాగే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. పోలవరానికి నిధులు ఇస్తున్నందుకు తమ సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం జగన్‌కు కేంద్రమంత్రి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే 70శాతం పూర్తయినందున.. మిగతా 30శాతం నిర్మాణ బాధ్యతలు కేంద్రమే చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పోలవరం నిర్మాణంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఆయన..రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు నక్సలిజంపై కేంద్రహోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జగన్.. కేంద్రానికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com