విద్యార్థి మృతదేహంతో రోడ్డుపై ధర్నా

విద్యార్థి మృతదేహంతో రోడ్డుపై ధర్నా

స్కూల్‌ బస్సు డ్రైవర్ మద్యం మత్తు, అతి వేగం ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులో జరిగింది. వాగేశ్వరి ప్రైవేటు పాఠశాల బస్సు ఆర్టీసీ బస్‌ డిపో ముందు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో మనస్విని, దీక్షిత అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా... నాలుగో తరగతి చదువుతున్న రితీష్‌ సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రిషిత్‌ మృతదేహంతో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ దగ్గర తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఈవో .. వాగేశ్వరి స్కూల్‌ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మద్యం మత్తులో స్కూల్‌ బస్సు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్‌ బస్సుకు ఫిట్‌ నెస్ లేదన్న ఆరోపణలు రావడంతో రవాణా శాఖ అధికారులు సైతం రంగంలోకి దిగారు. బస్సుకు అనుమతులపై విచారణ జరుపుతున్నారు.

వేములవాడలో స్కూల్‌ బస్సు బోల్తాఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై బాలల హక్కుల సంఘం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈఘటనకు కారణమైనందున యజమాని రవిచందర్‌రావును వెంటనే అరెస్ట్‌ చేయాలని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

Tags

Next Story