హరీష్‌రావుకు 50 -50 ఛాన్సే ఉందా..?

హరీష్‌రావుకు 50 -50 ఛాన్సే ఉందా..?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కేదెవరికి.. వేటు పడే మంత్రులు ఎవరు..? కేటీఆర్‌కు 100 శాతం మంత్రి పదవి ఖాయమా..? హరీష్‌రావుకు 50 -50 ఛాన్సే ఉందా..? ఈటెలపై వేటు పడక తప్పదా..? ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బడ్జెట్‌ సమావేశాలకు ముందే కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి కులాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ విస్తరణ చేపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిపి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 12 మంది ఉన్నారు.. మొత్తం 18 మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నా.. కొన్ని ఖాళీలు ఉంచి కేబినెట్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రులదర్నీ కొనసాగించాలంటే.. కొత్తగా ఆరుగుర్ని తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే కేసీఆర్‌ మాత్రం.. కొంతమంది మంత్రులను తప్పించి.. రెండు విడతల్లో మరికొందరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిదశ విస్తరణ దసరా లోపు కాగా.. రెండో విడత సంక్రాంతి నాటికి చేపట్టవచ్చని సమాచారం.

గతంతో పోల్చుకుంటే ఈసారి కూలాల సమీకరణ ఆధారంగానే కేబినెట్ బెర్తులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతలా కులాల ఆధారంగా బెర్తులు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయపరిస్థితుల దృష్ట్యా కులాల ఆధారంగా కేటాయింపుపై కసరత్తు జరుగుతోందని ప్రచారం ఉంది..

ప్రస్తుతం కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 5 గురు మంత్రులు ఉన్నారు. తొలి విడతలో 15 మందితో మంత్రి వర్గ విస్తరణ చేపడితే.. రెడ్డి సామాజిక వర్గం మంత్రుల సంఖ్య ఐదుకు మించే పరిస్థితి లేదు. అయితే ఈసారి మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేంధర్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డిలను తీసుకునే అవకాశం ఉంది.. గుత్తా ఎప్పటి నుంచో మంత్రి వర్గంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా చేసినా.. ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వడంతో మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టిన సబితా ఇంద్రా రెడ్డికి సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీరద్దరినీ క్యాబినెట్లోకి తీసుకోవాలంటే.. జగదీశ్వర్ రెడ్డి, మల్లా రెడ్డిలపై వేటు పడక తప్పకపోవచ్చు..

ముఖ్యంగా మున్నూరు కాపు నుంచి ఒకరికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల బీజేపీ తరపున ఇద్దరు మున్నూరు కాపుకు చెందిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. వీరికి తోడు త్వరలో బీజేపీ గూటికి చేరతారనుకుంటున్న డీఎస్ కూడా మున్నూరు కాపుకు చెందిన వ్యక్తే.. బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక వర్గ ఓటర్లంతా బీజేపీకి చేరువయ్యే ప్రమాదం ఉండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కోటాలోగంగుల కమలాకర్, దానం నాగేందర్, వినయ్ భాస్కర్, బాజి రెడ్డి గోవర్థన్ రేసులో ఉన్నారు..

ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు క్యాబినెట్ లోకి రావాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల ఎం.ఐ.ఎం అధినేత అసద్ సైతం కేటీఆర్ మంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి సైతం కేటీఆర్ ను మంత్రిగా చూడాలంటూ చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కు 100 శాతం మంత్రి వర్గంలోచోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగే కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది..

మాజీ మంత్రి హరీష్ రావు విషయంలోనే పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించారు. అయినా ఆయన్ను తప్పించడంపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ సైతం హరీష్ రావును పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తోంది. హరీష్ రావు మాత్రం తాను కేసీఆర్ వెంటే ఉంటానని చెబుతున్నారు. మరి హరీష్ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ పెరిగింది.

ఇటు మంత్రి ఈటెలపై వేటు తప్పకపోవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం నుంచి లీకులు వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ సంఘాల భేటీ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలను ఈటెల లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈటెలను క్యాబినెట్ నుంచి తప్పించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే బీసీ కులాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story