బతికుండగానే తల్లిని శ్మశానానికి తరలించిన కొడుకు

బతికుండగానే తల్లిని శ్మశానానికి తరలించిన కొడుకు

కన్న తల్లిదండ్రులు బిడ్డలకు బరువయ్యారు. అందరూ ఉన్నా వారు అనాధలుగా మారుతున్నారు. కొందరిని వృద్దాశ్రమాల్లో వదిలిస్తే.. మరికొందరిని రోడ్లపై వదిలేస్తున్న ఘటనలను మాత్రమే చూశాం. తాజాగా ఓ కొడుకు బతికి ఉన్న తల్లిని శ్మశానానికి చేర్చాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలైన తన తల్లిని శ్మశానానికి చేర్చాడు ఆ ప్రబుద్దుడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వాసుపత్రి సిబ్బంది రంగంలోకి దిగి ఆమెను కాపాడి ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలలోని వీక్లీ బజార్‌కు చెందిన 95 ఏళ్ళ చెట్‌పల్లి నర్సమ్మ వయోభారంతో బాధపడుతోంది. కొడుకు ధర్మయ్య ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ధర్మయ్య ఉండేది అద్దె ఇల్లు. ఈ క్రమంలో నర్సమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే తన తల్లి ఆ అద్దె ఇంట్లో చనిపోతే యజమానితో మాట పడాల్సివస్తుందని భావించి ఆమెను ముందుగానే శ్మశానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి సమాచారం అందించారు. దీంతో వారు నర్సమ్మను శ్మశానం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story