ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు!

ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తానని గతంలోనే ప్రకటించారు సీఎం కేసీఆర్‌. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా..మరో మహిళా ఎమ్మెల్సీ తోడయ్యారు. దీంతో ఈ నలుగురిలో ఇద్దరు మంత్రులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మ‌హిళ మంత్రి లేకుండా ఐదేళ్లు గ‌డిచిపోయింది. ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉండ‌గా మ‌హిళ‌కు అవ‌కాశం రాలేదు. మ‌రో ఆరు ఖాళీలు ఉండ‌టంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

చాలా కాలం త‌ర్వాత కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌బోతుంది. గెలిచిన ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేల్లో సీనియ‌ర్ ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి. ఉద్యమకాలం నుంచి పార్టీ వెన్నంటి ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఆమె గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే మాజీ మంత్రి ,సీనియ‌ర్ నాయ‌కురాలు స‌బితా ఇంద్రా రెడ్డి పార్టీలో రావడంతో రెడ్డి సామాజిక వ‌ర్గానికి కాంపిటీష‌న్ పెరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కురాలు కావ‌డం .. గ‌తంలో ప‌లు కీల‌క‌మైన మంత్రి ప‌దవులు చేప‌ట్టిన అనుభవం ఉండ‌టంతో స‌బితా ఇంద్రా రెడ్డికే మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలున్నాయి. అటు... పార్టీలో చేర్చుకునేప్పుడే కేసిఆర్ హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం జరుగుతోంది

ఇక ఎస్టీ కోటాలో ఎమ్మెల్యే రేఖానాయక్‌తోపాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రేసులో ఉన్నారు. రాథోడ్ గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి..టీఆర్ఎస్‌లో చేరారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిన పార్టీ ఆమెను ఎమ్మెల్సీని చేసింది. రాజకీయంగా రేఖా నాయక్ కంటే సీనియర్‌ అయిన సత్యవతి రాథోడ్‌కే మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.

పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న గొంగిడి సునీతా రెడ్డికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో విప్‌గా ఉన్న ఆమె ఈ సారి ఆలేరు నుంచి రెండోసారి గెలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జ‌గ‌దీష్ రెడ్డికి రెండోసారి మంత్రి ప‌ద‌వీ ద‌క్కింది. అయితే ఈసారి జిల్లానుంచి ఎక్కువ సీట్లు గెల‌వ‌డంతో రెండో మంత్రి ప‌ద‌వీ రావొచ్చు. ఇప్పటికే గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కేబినెట్ బెర్త్ కోసం ప్రయ‌త్నిస్తుండ‌గా మ‌హిళకు ఇస్తే త‌న‌కేనంటూ సునీతారెడ్డి ఆశాభావంతో ఉన్నారు. ఒకే జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ఇవ్వడానికి సిద్ధమైతే అటు సుఖేందర్‌రెడ్డికి లేదా సునీతకు బెర్త్ దక్కనుంది.

Tags

Read MoreRead Less
Next Story