బీజేపీకి స‌వాల్ విసిరిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

బీజేపీకి స‌వాల్ విసిరిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో ముక్కోణ రాజ‌కీయాలు నడుస్తున్నాయి. నువ్వొకటంటే.. నే రెండంటా అంటూ.. కారు .. క‌మ‌లం .. హ‌స్తం పార్టీల నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో బ‌లం పుంజుకునే ఎత్తుగడలో ఉన్న బీజేపీ... అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఐతే.. కమలనాథుల అవినీతి విమర్శలపై అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్లే వ‌స్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై విద్యుత్ సీఎండీ ప్రభాకర్‌ రావు చేత పూర్తి స్థాయిలో వివ‌ర‌ణ ఇప్పించిన ప్రభుత్వం పెద్దలు.. ఇటు రాజ‌కీయంగా కూడా గ‌ట్టి కౌంట‌రే ఇస్తున్నారు. లక్ష్మణ్‌ సవాళ్లపై ప్రతిసవాళ్లు విసురుతూ.. దేనికైనా తాము సిద్ధమేనని ప్రకటిస్తున్నారు.

అయితే బీజేపీ-టీఆర్ఎస్‌ల మ‌ధ్య ఈ పొలిటిక‌ల్ సవాళ్లపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిల‌మవుతోంది. ఈ రెండు పార్టీల‌ది లాలూచీ రాజ‌కీయమని కాంగ్రెస్‌ నేతలు తూర్పార‌బ‌డుతున్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ నాటకాలు ఆపాలనంటున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో లక్ష్మణ్‌ ఆరోపణల నేపథ్యంలో.. సీబీఐ విచారణకు అదేశించండి.. నిజాయితీ నిరూపించుకుంటామని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరినా .. ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు. మేం కేంద్ర హోమ్ శాఖ‌కు ఫిర్యాదు చేస్తాం .. సీబీఐ విచార‌ణ జ‌రిపించేందుకు సిద్ధమా అంటూ బీజేపీకి స‌వాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్‌ను సైడ్ చేసేందుకే టీఆర్ఎస్-బీజేపీలు క‌లిసి నాట‌కాలాడుతున్నాయ‌ని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కారు-క‌మ‌లం మ‌ధ్య డూప్‌ ఫైట్‌ నడుస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల విష‌యంలో కేటీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌పై చేసిన విమ‌ర్శలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ స‌ర్కారు చేస్తున్న త‌ప్పుల‌ను నిరూపించేందుకు తాము సిద్దమని.. బ‌హిరంగ చ‌ర్చకు రావాలంటూ స‌వాల్ విసురుతున్నారు.

కారు-కమలం మధ్య నడుస్తున్న సవాళ్లు-ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. తాము ఏమాత్రం వెనుకపడొద్దన్నట్లు కాంగ్రెస్‌ ఆ రెండు పార్టీల్ని కార్నర్‌ చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌కు.. బీజేపీకి సవాల్‌ విసురుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఈ పొలిటికల్‌ ట్రయాంగిల్‌ వార్‌ రానున్న రోజుల్లో ఎలా మారుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story