ఆంధ్రప్రదేశ్

ఏపీలో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ

ఏపీలో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ
X

ఏపీ ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం అనుకున్నంతగా లేదు. అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, జీతాలు, ఇతరత్రా ఖర్చులు చూస్తే అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప... తగ్గే అవకాశాలేమీ లేవు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ఏంచేయాలో తెలియక ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అయోమయంలో ఉంది. వాణిజ్యపన్నుల ఆదాయంలో అనుకున్నంత వృద్ధి లేదన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఉక్కు, ఇనుము ధరలు తగ్గటం ఆదాయంపై ప్రభావం చూపుతోందన్నారు. సిమెంటు ధరలు తగ్గటంతో దానిపై వచ్చే పన్నురాబడి పడిపోయిందన్నారు. మొత్తంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి నమోదు కావాల్సి ఉండగా 5.3 శాతమే వచ్చింది. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కానీ.. ఈ పరిస్థితి ఎంత వరకూ మెరుగుపడుతుందంటే అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేదనే చెప్పాల్సి వస్తోంది.

వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, స్టాంపులు, రవాణా శాఖాలపై సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు చెప్పిన విషయాలు.. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. దీంతో ఈ లోటుపాట్లపై చర్చించి.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు జగన్. ఐతే.. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ప్రభుత్వ విధానాలే పెట్టుబడుల్ని దెబ్బతీస్తున్నాయా? ఆ కారణంగానే ఆర్థిక మందగమనం నెలకొందా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా వెళ్తున్న ప్రగతి రథానికి బ్రేకులు వేసిందెవరు? ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఎం ఏం చేస్తారు..? ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలకు భరోసా ఎలా కల్పిస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

Next Story

RELATED STORIES