బంగారం లాంటి వార్త.. ఇకపై మీ బంగారం..

బంగారం లాంటి వార్త.. ఇకపై మీ బంగారం..

మగువల మనసు దోచేది బంగారం.. అతివల అందాన్ని మరింత ఇనుమడింపజేసే బంగారు నగలంటే మోజు పడని మహిళలు వుండరు. పెళ్లిళ్లు, పేరంటాల్లో ధగ ధగ మెరిసే నగలతో కనువిందు చేస్తుంటారు. సందర్భానుసారంగా చిన్ని నగైనా వారి మెడను అలంకరించాల్సిందే. మరి వాటిని భద్రంగా ఎలా ఉంచుకోవడం.. లాకర్‌లో పెట్టి కావలసినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు చాలా మంది. కానీ లాకర్‌లో పెట్టిన బంగారానికి, బ్యాంకు యాజమాన్యానికి సంబంధం ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు లాకర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే.. బ్యాంకులు బాధ్యత తీసుకోవు. బ్యాంకులో దోపిడీ జరిగి లాకర్లలోని బంగారాన్ని కొల్లగొట్టినా బ్యాంకులు బాధ్యత వహించవు. మరి మీరెంతో మోజుపడి కొనుక్కున్న నగలు.. అవసరానికి అక్కరకొస్తాయని బంగారం రూపంలో పెట్టుబడి పెట్టిన సొమ్ముకు భద్రత లేకుండా పోతే ఎలా.. అందుకోసం ఆభరణాల భీమా (జ్యువెలరీ ఇన్సూరెన్స్) తీసుకోవడం ఒక్కటే మార్గం.

బంగారానికి బీమా తీసుకుంటే ధీమాగా ఉండొచ్చు. ప్రస్తుతం సాధారణ బీమా సంస్థలు గృహ బీమా పాలసీలో అంతర్గతంగా ఆభరణాల బీమాను అందిస్తున్నాయి. పాలసీ తీసుకుంటే ఇంట్లో ఉంచుకున్న నగలతో పాటు, బ్యాంకు లాకర్లలో పెట్టిన ఆభరణాలకూ ఇది రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఆ నగలను ధరించినప్పుడు పొరపాటున పోయినా నష్ట పరిహారం పొందవచ్చు. ఒకసారి పాలసీ తీసుకుంటే వాటికి సంబంధించినంతవరకు ఎప్పటికీ రక్షణ ఉన్నట్లే. మీ నగలకు భద్రత ఎప్పటికీ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, దొంగతనం జరిగి ఆభరణాలు పోయినా రక్షణ కల్పిస్తుంది.

గృహ బీమాలో భాగంగానే కాకుండా కేవలం ఆభరణాలకు మాత్రమే బీమా తీసుకునే వెసులుబాటుని పలు బీమా సంస్థలు అందిస్తున్నాయి. బంగారు నగలే కాకుండా, విలువైన వస్తువులు, పురాతన వస్తువులకు కూడా ప్రత్యేకంగా బీమా తీసుకునే సౌకర్యం ఉంది. వీటికి సంబంధించిన ప్రీమియం వస్తువుల విలువను బట్టి అంచనా వేస్తారు. క్లెయిమ్ చేసుకోదలచినప్పుడు పాలసీ కొనుగోలు చేసిన సమయంలో పేర్కొన్న మొత్తాలను బట్టి పరిహారం చెల్లిస్తారు. కంపెనీ గురించిన అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం.

Tags

Next Story