కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు

కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు
X

కోయకుండానే ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మరోసారి జనానికి ఉల్లి కష్టాలు మొదలయ్యాయి. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. రెండు వారాల కిందట 20 నుంచి 30 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా 45 రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో మార్కెట్లో రెండు మూడు కిలోలు కొనుక్కుని వెళ్లిన జనం.. ఇప్పుడు అందులో సగానికే సరిపెట్టుకుంటున్నారు.

పది రోజుల నుంచి సరఫరా సగానికి సగం తగ్గిపోయింది. మలక్‌పేట మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, తాండూరు నుంచి ఉల్లిపాయాల సరఫరా అవుతాయి. వర్షాల కారణంగా మహబూబ్‌నగర్‌, తాండూరునుంచి ఉల్లిగడ్డల సరఫరా ఆగిపోయింది. ఇక ఢిల్లీ, బెంగుళూరు తదితర మెట్రో నగరాల్లో కూడా ఉల్లి 44 దాకా పలుకుతోంది. ఉల్లిని అధికంగా పండించే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సమే ధరలు పెరగడానికి కారణమంటున్నారు. అసలే ఈ సీజన్‌లో పంట తక్కువగా వేయడం, చేతికొచ్చే దశలో పంట నీటిపాలు కావడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది. ఏపీలో కూడా ఉల్లి సాగుపై వర్షాభావ ప్రభావం పడింది. తెలంగాణలో పంట చేతికి రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి అందుబాటులో లేకుండా పోయింది.

అరబ్‌ దేశాలతో పాటు సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో ఉల్లికి మంచి గిరాకీ ఉండడంతో పాటు ఉల్లి ఎగుమతులపై కేంద్రం సుంకాన్ని తగ్గించింది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి ఆ దేశాలకు ఉల్లి ఎగుమతులు అధికంగానే సాగుతున్నాయి. దీంతో దేశంలో ఉల్లి పాయలకు డిమాండ్‌ ఏర్పడిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారంలో రోజుల్లో కిలో ధర రూ. 50 దాటే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Next Story