వేములవాడ స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై అధికారుల చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్కూల్ బస్సు ప్రమాదంపై చర్యలు మొదలయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో కదిలిన విద్యాశాఖ అధికారులు.. వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్‌ చేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

స్కూల్‌ బస్సు ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు.. స్కూల్‌ బస్సు కండీషన్‌పై విచారణ చేపట్టారు. దర్యాప్తులో ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సుకు ఫిట్‌నెస్‌ లేనట్లు గుర్తించారు. బస్సును సీజ్‌ చేశారు. ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్టీఓ అధికారులు.. నిరంతరం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.

బుధవారం వేములవాడలో స్కూల్‌ బస్సు డ్రైవర్ మద్యం మత్తు, అతి వేగం ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసింది. వాగేశ్వరి ప్రైవేటు పాఠశాల బస్సు ఆర్టీసీ బస్‌ డిపో ముందు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో మనస్విని, దీక్షిత అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో తరగతి చదువుతున్న రిశిత్‌ సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు పలువు పార్టీల నేతలు చిన్నారులను పరామర్శించారు.

Tags

Next Story