మున్సిపల్‌ ఎన్నికలపై నజర్‌ పెట్టిన టీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ ఎన్నికలపై నజర్‌ పెట్టిన టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికలపై నజర్‌ పెట్టింది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. తెలంగాణ భవన్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా... మొత్తం 141 మున్సిపాల్టీలపై సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్‌లను ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పురపాలక ఎన్నికలను పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇంచార్జ్ లు సమన్వయం చేయనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల బలాబలాలపై ఆరా తీశారు. ఈ నెల 31లోపు బూత్, డివిజన్, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, ఎన్నికలకు పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి గొప్ప స్పందన లభించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని లక్షల మంది స్వచ్ఛందంగా తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనని కేటీఆర్ ధీమావ్యక్తం చేశారు.

Tags

Next Story