జగన్ తో చర్చలు జరుగుతున్నాయి : సీఎం కేసీఆర్

జగన్ తో చర్చలు జరుగుతున్నాయి : సీఎం కేసీఆర్

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయన్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. సుమారు 35 వేల 500 కోట్ల అంచనాతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవపల్లిలో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఆ పనుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తామని చెప్పారు. గోదావరి-కృష్ణా అనుసంధానం ఉత్తమమైన మార్గమని.. అదే జరిగితే అద్భుతమైన ఫలితాలొస్తాయని అన్నారు.

గోదావరి-కృష్ణా అనుసంధానం గొప్ప నిర్ణయమని కేసీఆర్‌ అన్నారు. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరగనుందన్నారు. దీనిపై పొరుగు రాష్ట్ర సీఎంతో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో అవి పూర్తయి ఓ నిర్ణయానికి రానున్నామని చెప్పారు. ఏపీలో చంద్రబాబు వంటి నేతలు సంకుచిత మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తగాదాలకు దిగడం తప్ప వేరేదేమీ లేదని విమర్శించారు. విపక్షాల ఆరోపణలపై మండిపడ్డారు కేసీఆర్‌. రైతు సంక్షేమమే లక్ష్యమన్నారు. అన్నదాత బాగుపడేవరకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని.. 5 వేల కోట్లు కాదు 15 వేల కోట్ల బిల్లైనా భరించేందుకు సిద్ధమన్నారు. ప్రాజెక్టులపై విపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం స్పూర్తితో పాలమూరు రంగారెడ్డిని ఏడాదిలో పూర్తి చేయాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. 16.7 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తున్నందున.. వారంలోపు మూడు షిఫ్టుల్లో పనులు పూర్తి చేయడానికి అవసరమైన కార్మికులను రప్పించుకోవాలని సూచించారు. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు 200 కోట్లను వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. అంతకుముందు వట్టెం గ్రామస్తులను పలకరించిన కేసీఆర్‌.. అన్నీ తాను చూసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story