కలెక్టర్‌‌పై ఎంత ప్రేమ.. పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్తులు

కలెక్టర్‌‌పై ఎంత ప్రేమ.. పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్తులు
X

మా ఊరు చిన్నదే కావచ్చు.. మా గ్రామ జనాభా తక్కువే కావచ్చు.. మాకూ సమస్యలు ఉంటాయి.. వాటిని పరిష్కరించేవారేరి.. ఎందరో పాలకులు ఏవేవో వాగ్ధానాలు చేస్తారు. అధికారంలోకి రాగానే మావైపు కన్నెత్తైనా చూడరు. సమస్యలు స్వయంగా తెలుసుకుందామని మాఊరికి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన కలెక్టర్‌ని ఇక మేమెందుకు నడవనిస్తామంటూ గ్రామస్తులు పల్లకిలో తీసుకువెళ్లారు సంతోషంగా. ఆ గ్రామానికి కలెక్టర్ రావడం అదే తొలిసారి మరి.

మిజోరాం రాష్ట్రం సియహా జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామం తిసోపీ. అక్కడ 400 మంది జనాభా మాత్రమే ఉంటారు. ఇక్కడ సౌకర్యాలూ అంతంత మాత్రమే. కనీసం రోడ్డు సదుపాయం లేదు. ఇటీవల కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఈ పనులను పర్యవేక్షించేందుకు సియహా జిల్లా కలెక్టర్ భూపేశ్ చౌదరి ఆగస్టు 27,2019న తిసోపీ వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ కలెక్టర్ గ్రామానికి వస్తున్నారని తెలిసి గ్రామస్తుల మొహంలో సంతోషం వెల్లివిరిసింది. ఆయన రాక కోసం ఎదురు చూసిన గ్రామస్తులు ఊరి పొలిమేరల వరకు రాగానే కలెక్టర్‌ను పల్లకిలో ఎక్కించుకుని గ్రామంలోకి మోసుకెళ్లారు. కలెక్టర్ వద్దని వారించినా వినిపించుకోలేదు. వారి ప్రేమాభిమానాలకు పులకించిపోయిన కలెక్టర్ భూపేశ్.. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను చూడగానే వారెంతో సంతోషపడ్డారు. ఇంతవరకు వాళ్ల ఊరికి ఏ కలెక్టరూ రాకపోవడంతో.. వెళ్లిన నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామస్థాయిలోకి వెళ్తేనే ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కుంటున్న సమస్యలు తెలుస్తాయని అందుకే నా ఈ పర్యటన అని భూపేశ్ అంటున్నారు.

Tags

Next Story