'అతని తప్పిదం వల్లే వేములవాడలో స్కూల్ బస్సు ప్రమాదం'

అతని తప్పిదం వల్లే వేములవాడలో స్కూల్ బస్సు ప్రమాదం
X

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన స్కూల్‌ బస్సు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులను మృత్యు కబళించింది. కన్నపేగుకు గర్భశోకాన్ని మిగిల్చింది. పిల్లల బంగారు భవిష్యత్తుపై తల్లిదండ్రులు కన్న కలలు కలగా మిగిలిపోయాయి. అల్లారుముద్దుగా చూసుకున్న తమ చిన్నారులు విగతజీవులుగా మారడంతో కన్నవారు తల్లిడిల్లిపోయారు. ప్రైవేట్‌ స్కూల్‌ యజమాన్య నిర్వాకం..బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను చిదిమేసింది. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్‌ ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన అధికారులు..వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్‌ చేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

బస్సు డ్రైవర్‌ తప్పిదం వల్లే వేములవాడలో ప్రమాదం జరిగిందని తేల్చారు అధికారులు. ఈ ఘటనకు స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఫిట్‌నెస్‌లేని వాహనాలలో రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు. ఫిటెనెస్‌ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవన్నారు ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్.

వేములవాడలో స్కూల్‌ బస్సు డ్రైవర్ మద్యం మత్తు, అతి వేగం ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసింది. వాగేశ్వరి ప్రైవేటు పాఠశాల బస్సు ఆర్టీసీ బస్‌ డిపో ముందు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో మనస్విని, దీక్షిత అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా... నాలుగో తరగతి చదువుతున్న రిశిత్‌ సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్‌ బస్సుల రోడ్డు ప్రమాదాలతో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. వీటికి పుల్‌ స్టాప్ మాత్రం‌ పడడం లేదు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం..అధికారులు పర్యవేక్షణ లోపం విద్యార్ధులను మృత్యుఒడికి చేరుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయకుండా శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags

Next Story