టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది : లక్ష్మణ్

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది : లక్ష్మణ్

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు మించి అధికార పార్టీ మీదికి దూకుడు పెంచుతోంది బీజేపీ. వలసల జోష్ తో బలం పుంజుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయటమే పనిగా పెట్టుకుంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని జనం ముందుకు తీసుకొస్తోంది బీజేపీ.

పార్టీ సభ్యత్వ నమోదు కోసం జిల్లాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్...టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో BJP దూసుకుపోతుంటే TRS పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వెళుతూ మార్గం మధ్యలో నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఆగిన లక్ష్మణ్ కు ఘనస్వాగతం పలికారు నేతలు. ఈ సందర్భంగా పలువురు నేతలకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కొత్తగూడెంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్..రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారు. కారుణ్య నియామకాలతో పాటు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.

ఆ తర్వాత కుసుమంచి మండలం పాలేరులో జరిగిన సభలో పాల్గొన్నారు లక్ష్మణ్. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మున్ముందు వలసలు మరింత ఊపందుకుంటాయన్నారు. ఇప్పుడు జరుగుతోంది అంతా ట్రైలర్ మాత్రమేనన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పోరాటానికి సిద్ధం కావాలన్నది బీజేపీ లక్ష్యం. దీంతో ఇప్పటికే ఓ విడత వలసలకు గేట్లు తీసిన కమలం పార్టీ..మరికొందరు నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇటు వలస నేతల బలగం..అటు సభ్యత్వ నమోదుతో బలం పెంచుకుంటోంది బీజేపీ.

Tags

Read MoreRead Less
Next Story