లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా.. బీజేపీ వ్యూహం

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా.. బీజేపీ వ్యూహం

మున్సిపల్‌ పోరుకి సై అంటోంది తెలంగాణ బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇత‌ర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ ప్రభావం క‌చ్చితంగా రాబోయే మున్సిపల్‌ ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని భావిస్తున్నారు కమలం పార్టీ నేత‌లు. ఇందుకు అనుగుణంగా ఎన్నికలకు భారీ కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో నాయ‌కులే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ చేప‌డుతోంది బీజేపీ. గ‌తంలో ఆయా మున్సిపాల్టీల్లో కీల‌కంగా ఉండి ప్రస్తుతం తటస్థంగా ఉన్న నేతలను, ఇత‌ర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేత‌లను పార్టీలోకి తీసుకుంటోంది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేసే అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న బీజేపీ.. ప్రతి పౌరుడినీ కదిలించేలా దిశానిర్ధేశం చేస్తోంది. ఇప్పటికే బీజేపీలో ఉన్నముఖ్య నేత‌ల‌కు, కొత్తగా వ‌చ్చిన నేత‌లు జ‌త క‌లిస్తే తిరుగులేకుండా మునిసిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవ‌చ్చని భావిస్తోంది.

17 పార్లమెంటు స్థానాల‌ పరిధిలో మున్సిపల్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి నేతను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వచ్చే నెల 5 నుంచి 10 వరకు మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌లతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది. వార్డుల వారిగా సమీక్షలు చేయనున్న సమన్వయ కమిటీ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని కార్యకర్తలకు వివరించనున్నారు. ప్రతి మున్సిపాలిటీ స్థానిక మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి... 370 ఆర్టికల్ రద్దు, జాతీయ వాదం, విమోచనదినంపై చర్చించనున్నారు. సెప్టెంబర్ 17 వ తేదీన అన్ని మున్సిపాలిటీల్లో భారీ ఎతున్న ర్యాలీలు చేయాలన్నది కమలనాథుల ప్లాన్. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ లబ్ది దారులను కలవడం, ఆ మున్సిపాలిటీకి ఎంత మేర కేంద్రం నుండి విడుదలైన నిధుల వివరాలను ప్రదర్శనకు పెట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్‌ చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.

ప్రభుత్వ వైఫల్యాలతో పాటు 370 రద్దు మునిసిపల్ ఎన్నికల్లో తమకు బాగా కలసి వస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం వ్యూహాలు ఏమేర‌కు ఆ పార్టీ గెలుపుకు పని చేస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story