ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీళ్లిచ్చారా : భట్టి ప్రశ్న
కేసీఆర్ సర్కార్‌పై విపక్షాలు ముప్పేట దాడికి దిగుతున్నాయి. ఒవైపు నుంచి కాంగ్రెస్.. మరోవైపు నుంచి బీజేపీ.. ఆరోపణలు వర్షం కురిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని మాయమాటలు చెబుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీళ్లిచ్చారా అని సీఎం కేసీఆర్‌ను భట్టి ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరో నాలుగు నెలల్లో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందిస్తామని చెప్పిన కేసీఆర్ మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు.
అటు.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. కొందరు దుర్మార్గులు, ప్రగతి నిరోధక శక్తులు కేసులేశారని పాలమూరు పర్యటనలో కేసీఆర్ అన్నారు, కానీ ఆ ప్రగతి నిరోధక శక్తులంతా ఆయన పక్కనే స్టేజీపై ఉన్నారని కౌంటరిచ్చారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి కేసీఆర్ అడ్డంకిగా మారారని విమర్శించారు. పాలమూరులో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయని గుర్తు చేశారు. మాటలతో ప్రజలను మోసం చేయడం మానెయ్యాలని హితవు పలికారు. ‘కేసీఆర్.. బీజేపీతో బస్సుయాత్రకు రండి. ఎక్కడెక్కడ నీళ్లిచ్చారో చూసొద్దామంటూ సవాల్ విసిరారు.
విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ తన ఆరోపణలను కొనసాగిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ సమస్యలపై బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. విద్యుత్ రంగంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్... దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే సీబీఐ దర్యాప్తు కోరుతామన్నారు. మొత్తానికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం రేసులో... కాంగ్రెస్, బీజేపీలు సర్కార్‌పై విమర్శల దాడి పెంచాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com