త్వరలో మోదీ, అమిత్‌షాను కలుస్తా : పవన్ కళ్యాణ్

త్వరలో మోదీ, అమిత్‌షాను కలుస్తా : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు వద్ద వంతెన పనుల్ని పరిశీలించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పవన్‌ ముందు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధానిపై మంత్రి బొత్స ప్రకటనలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చాం తప్ప... ఓ పార్టీకి ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన అధినేత. మరోవైపు అమరావతిలో నిర్మాణాలను పరిశీలించారు పవన్‌. ఆగిన నిర్మాణాలపై స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్‌ చేశారు‌. రాజధాని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదన్నారు. రాజధాని విషయంపై ప్రకటనలు చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి బొత్సకు సూచించారు. రాజధానిలో అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత సమస్యలపైనా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసే ఆలోచన ఉందన్నారు. సమయం దొరికితే వాళ్లను కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానన్నారు.

రాజధానికి అవసరమైన డబ్బు జగన్‌ తన జేబులోంచి తీసి ఇవ్వడం లేదని పవన్‌ అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని ఆకాంక్షించారు. రాజధానిగా అమరావతి ఉంటుందని తాను మాటిస్తున్నా అని పవన్‌ అన్నారు. రైతులు ప్రభుత్వానికి భూమి ఇచ్చారు తప్ప.. టీడీపీకి కాదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

ఇప్పటికే రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. మళ్లీ ఇలాంటి గందరగోళమైన నిర్ణయాలతో నష్టం చేయాలనుకుంటే బలమైన నిర్ణయాలు తీసుకుంటామని పవన్‌ స్పష్టం చేశారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story