సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసులో మరో మలుపు
కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. పథకం ప్రకారమే సతీష్‌ను ఇంటికి పిలిచి హేమంత్ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంకను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హేమంత్, సతీష్ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నట్లు ప్రియాంక వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడు హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సతీష్, హేమంత్ ఇద్దరూ బాల్యస్నేహితులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. సతీష్ కంపెనీ పెట్టి హేమంత్‌ను పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. అయితే ఆర్థిక విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నెల 28న ఆఫీస్‌కు వెళ్లిన సతీష్ అదేరోజు.. రాత్రి 10 గంటలకు ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు. కానీ తెల్లవారినా ఇంటికి రాక పోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో భార్య ప్రశాంతి అతని స్నేహితుల వద్ద విచారించింది. ఆచూకీ లభించక పోవడంతో 29న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హేమంత్‌కు ప్రశాంతి ఫోన్ చేసింది. అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆమె... కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఆఫీస్‌కు వెళ్లింది. హేమంత్ అడ్రస్ తెలుసుకుని అతని ఇంటికి వెళ్లింది.
హేమంత్ ఇంటికి తాళం వేసి ఉండడం, ఇంట్లోంచి దుర్గంధం వస్తుండడంతో అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారమిచ్చింది. కాలనీ వాసుల సమక్షంలో ఇంటి తాళాలు పగుల గొట్టి చూడగా సతీష్.. శవమై కనిపించాడు. సతీష్‌ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని సతీష్‌ను ఇంటికి పిలిపించుకున్నాడు హేమంత్. 28వ తేదీనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. శవాన్ని మాయం చేయాలని యత్నించాడు. ఇందుకోసం కవర్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. శవాన్ని ముక్కలుగా చేసి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే ధైర్యం చాలక అక్కడే వదిలి పరారై ఉండవచ్చంటున్నారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com