రజనీ సహృదయం.. నిర్మాతకు కోటి రూపాయలతో..

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ని హీరోగా పరిచయం చేసిన ఘనత సీనియర్ నిర్మాత కలైజ్ఞానంకి దక్కుతుంది. 1978లో రజనీకాంత్ సోలో హీరోగా నటించిన భైరవి చిత్రాన్ని కలైజ్ఞానం నిర్మించారు. ఇటీవల చెన్నైలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు ముఖ్య అతిధులుగా రజనీకాంత్, భారతీరాజా, శివకుమార్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన కలైజ్ఞానంకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని, అద్దె ఇంట్లోనే జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు సొంత ఇల్లు కట్టించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. నన్నింతటి వాడిని చేసిన నిర్మాతకు నేనే సొంత ఇల్లు నిర్మించి ఇస్తానని, ఆ అవకాశం ప్రభుత్వానికి ఇవ్వనని అన్నారు. త్వరలోనే ఆయన అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారిపోతారు. పది రోజుల్లో ఇంటికి సంబంధించిన డబ్బు ఇస్తాను అని అన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రజనీకాంత్ నిర్మాత కలైజ్ఞానం కోసం రూ.కోటి వ్యయంతో ఇల్లు కొనుగోలు చేశారని కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com