బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఎగ‌రేసుకుపోయేందుకు రాజ‌కీయ పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. 2018 ఎన్నిక‌ల్లో హస్తం గుర్తుపై 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. త‌రువాత అతి త‌క్కువ స‌మ‌యంలోనే 12 మంది కారెక్కేశారు. దీంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన‌ ప్రతిపక్ష హోదా కోల్పోవ‌డ‌మే కాదు.. పార్టీ మారిన 12 మందిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీక‌ర్ బులిటెన్ కూడా విడుద‌ల చేశారు.

టి-కాంగ్రెస్‌లో మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలపైనా పార్టీ మార్పుపై త‌రుచూ ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్శలు చేసి తాను బీజేపీలో చేర‌నున్నట్లు ప్రక‌టించారు. కానీ ఆయ‌న చేరిక వాయిదా ప‌డింది. ఆయ‌న పార్టీ మారితే అన‌ర్హత వేటు ప‌డే చాన్స్ ఉండ‌టంతో బీజేపీ హైక‌మాండ్ రాజ‌గోపాల్ రెడ్డి చేరిక‌ను వాయిదా వేస్తూ వ‌స్తోంది. ఆయనతో పాటు మ‌రో ముగ్గుర్ని చేర్చుకుంటే అసెంబ్లీలో కాంగ్రెస్‌ను బీజేఎల్పీలో విలీనం చేసుకోవ‌చ్చనే ప్లాన్‌లో క‌మ‌ల‌ద‌ళం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో బలపడేందుకు దూకుడు ప్రద‌ర్శిస్తున్న క‌మ‌లం నేత‌లు.. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను చేర్చుకోవ‌డంలో య‌మ బీజీగా ఉన్నారు. నాయ‌కులు కూడా అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి క్యూ క‌డుతున్నారు. అసెంబ్లీలో కూడా బ‌లం పెంచుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై క‌న్నేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ నుంచి వెళ్లిన ఓ నేతతో క‌మ‌లం నేత‌లు మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని టాక్. ఆయ‌న ద్వారా మిగ‌తా ముగ్గరి‌తో మంత‌నాలు జ‌రిపే ప్రక్రియ‌కు శ్రీ‌కారం చుడుతున్నారు కమలనాథులు.

బీజేపీ ఆశ‌ప‌డుతున్నట్లు కాంగ్రెస్ నుంచి మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారుతారా? అసెంబ్లీలో బ‌లం పెంచుకునేందుకు విలీన అస్త్రాన్ని ప్రయోగించాల‌న్న కాషాయ నేత‌ల ఆశలు ఫ‌లిస్తాయా? బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం గ్యాప్ లేకుండా ప్రయ‌త్నాలు ‌సాగిస్తోందన్నది మాత్రం వాస్తవం. మ‌రి కాంగ్రెస్ త‌మ ఎమ్మెల్యేల్ని కాపాడుకోగలదా?

Tags

Read MoreRead Less
Next Story