ఆంధ్రాబ్యాంక్ ఇక కనుమరుగు..

ఆర్థికమాంద్యం ఛాయలు పెరిగిపోతున్న వేళ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు సంస్కరణల పర్వాన్ని వేగవంతం చేసింది. గత వారం విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం, తాజాగా బ్యాంకింగ్ రంగంపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపరచడం, ద్రవ్యలభ్యత పెంపు, నిరర్థక ఆస్తుల తగ్గింపు, రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మరోసారి బ్యాంకుల విలీనం చేపట్టింది. గతంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మెర్జ్ చేసిన కేంద్రం, ఇప్పుడు మరో 10 బ్యాంక్ లను విలీనం చేసింది. యూనియన్, కార్పొరేషన్, కెనెరా, ఆంధ్రా బ్యాంకు, యునైటెడ్, ఓబీసీ, సిండికేట్, పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులను కలిపేసి 4 పెద్ద బ్యాంకులుగా మార్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మెర్జ్ చేశారు. యూనియన్, ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకులను కలిపి ఒకే బ్యాంకుగా మార్చారు. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేయగా, కార్పొరేషన్ బ్యాంకులో సిండికేట్ బ్యాంకును కలిపేశారు.
గతంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. మెర్జింగ్‌లతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్‌ల ను కలిపేయడం ద్వారా రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఉమ్మడి బ్యాంకు 11 వేల 437 బ్రాంచులతో 17.95 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ సామర్థ్యం కలిగి ఉంటుంది. కెనెరా-సిండికేట్ బ్యాంకుల విలీనంతో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడనుంది. ఆ బ్యాంకు బిజినెస్ విలువ సుమారు 15.20లక్షల కోట్లు.
యూనియన్, ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకుల మెర్జింగ్ తో ఐదో అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. ఉమ్మడి బ్యాంకు బిజినెస్ విలువ సుమారు 14.59 లక్షల కోట్లు. ఇండియన్-అలహాబాద్ బ్యాంక్ ల మెర్జింగ్‌తో 8.08 లక్షల కోట్ల బిజినెస్ సామర్థ్యం కలిగిన బ్యాంక్ ఏర్పడనుంది. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచుతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
బ్యాంకులను విలీనం చేయడంతోనే మోదీ సర్కారు ఆగిపోలేదు. బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చర్యలు తీసుకుంది. ఇప్పటికే 70 వేల కోట్ల రూపాయల రీ కాపిటలైజేషన్‌ను ప్రకటించిన కేంద్రం, పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి 16 వేల కోట్లు, యూనియన్ బ్యాంక్‌లోకి 11 వేల 700 కోట్లు మళ్లించనుంది. బ్యాంకింగ్ రంగంలో అవక తవకలను అరికట్టడానికి చీఫ్ రిస్క్ ఆఫీసర్ల నియమాకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంక్ డైరెక్టర్ల పదవీకాలాన్ని కూడా పొడిగించనుంది.
ఆర్బీఐ నుంచి లక్షా 76 వేల కోట్ల డివిడెండ్ తీసుకున్న కేంద్రంపై ప్రతిపక్షాల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అంతలోనే బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వచ్చిన ప్రకటనను తప్పుబడుతున్నారు. ఇక విలీనం ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు వ్యతిరేకంగా శనివారం సాయంత్రం నుంచి ఆందోళనకు దిగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com