యూరియా కొరతతో రైతులు అవస్థలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. వివిధ జిల్లాలకు సరఫరాలో జాప్యం కారణంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారు. దీన్ని సాకుగా చూపుతూ కొందరు వ్యాపారులు దోచుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ పరిధిలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతన్నలు వ్యవసాయ సహకార సంఘాలు, ఫర్టిలైజర్ షాపులు, DCMS కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. భూమి పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్సులను క్యూ లైన్లుగా పెట్టి యూరియా కోసం నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒక్క నల్గొండ జిల్లాలోనే 75వేల టన్నుల యూరియా డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు జిల్లాకు 47వేల టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. ఈసారి సాగర్ నిండుకుండలా మారడంతో రైతన్నల ఆశలు చిగురించాయి. దీంతో సాగు విస్తీర్ణం అమాంతంగా పెరగనుంది. దీనికి మరో 15వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల రైతులు నిరసనలకు దిగిన పరిస్థితి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com