ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం
X

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్రం. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళి సై సౌందరరాజన్‌ని తెలంగాణ గవర్నర్‌గా నియమించగా.. తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించింది కేంద్రం. అటు కేరళ గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్,‌ మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్‌ సింగ్‌ కోషియానిని నియమించింది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న కల్‌ రాజ్‌ మిశ్రాను.. రాజస్థాన్‌‌ గవర్నర్‌గా బదిలీ చేశారు.

తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తోంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌ రావుకు మహారాష్ట్ర గవర్నర్‌గా అవకాశం కల్పించగా.. ఇప్పుడు బండారు దత్తాత్రేయకు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా అవకాశం ఇచ్చింది.

మరోవైపు సుధీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందరరాజన్‌ని నియమించిన కేంద్రం... నరసింహన్‌కు ఏ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నరసింహన్‌ను కేంద్రం మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తుందా? లేక వేరే రూపంలో ఆయన సేవలను వినియోగించుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story