మహిళలకు సైతం మగవారే వైద్యం అందిస్తున్నారు - భట్టి

తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి బాట పట్టింది కాంగ్రెస్. అరకొర సౌకర్యాలతో రోగులు నిత్య నరకం అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆరోపించింది. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన నేతలు..అక్కడి దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నరకానికి నకళ్లు. సిబ్బంది ఉంటే సౌకర్యాలు ఉండవ్. సౌకర్యాలు ఉంటే సిబ్బంది ఉండరు. అన్ని ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం పేద రోగుల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులన్ని నిర్వీర్యం అయ్యాయని ఆరోపిస్తోంది. ప్రజాఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రియాలిటీ వేరే అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తోంది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలు, సిబ్బంది కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 పడకల ఆస్పత్రిలో 250 బెడ్లకు సరిపడా కూడా సిబ్బంది లేరని ఆరోపించారు. ఆఖరుకు మహిళా సిబ్బంది లేక మహిళలకు సైతం మగవారే వైద్యం చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత జిల్లాలోనే సరైన పర్యవేక్షణ చేయడం లేదంటూ భట్టి విమర్శించారు. పార్టీలు, పదవుల పంచాయితీతో ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. రోగులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మడత మంచాల్లో వైద్యం అందిస్తున్న తీరును ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com