తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ?

తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బదిలీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన మరొకరు తెలంగాణ గవర్నర్‌గా వస్తారంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొంతకాలంగా గవర్నర్ బదిలీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ సుదీర్ఘ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు. 2009 డిసెంబర్ 29న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. జనవరి 23, 2010న పూర్తికాలం గవర్నర్‌గా వచ్చారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచి తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహనతో వ్యవహరించారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలక పాత్ర పోషించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ మొదలు అనేక సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకున్నారు. ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్న నరసింహన్.. కొన్ని కీలకమైన చట్టాలపై సంతకం చేయకుండా కొన్ని మార్పులు సూచిస్తూ తిప్పి పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1945లో తమిళనాడులో జన్మించిన నరసింహన్‌కి హైదరాబాద్‌తో చాలా అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. లా కూడా పూర్తి చేశారు. తర్వాత 1968లో IPS ఆఫీసర్ అయ్యారు. ఏపీ క్యాడర్ అధికారిగా నంద్యాల, నరసరావుపేటల్లో పనిచేశారు. 1972లో ఇంటెలిజెన్స్‌కు మారారు. అందులోనే బ్యూరో డైరెక్టర్ స్థాయికి ఎదిగి రిటైరయ్యారు. మధ్యలో కొన్నాళ్లు మాస్కో ఎంబసీలో సెక్రటరీగా పనిచేశారు. నరసింహన్ సతీమణి విమలా నరసింహన్. రాజ్‌భవన్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె కూడా తెలుగు ప్రజలకు చిరపరిచితులయ్యారు.
మరోవైపు తమిళనాడుకు చెందిన జస్టిస్ పి.సదాశివంను తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సదాశివం ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా సదాశివం పనిచేశారు. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ను నియమించినప్పుడే నరసింహన్‌కు కూడా వీడ్కోలు పలుకుతారని వార్తలు వచ్చినా.. కేంద్రం కొంచెం సమయం తీసుకుంది. ఇప్పుడు సదాశివంకు బాధ్యతలు అప్పగించేందుకు అంతా సిద్ధం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com