లెక్క తేలింది.. 41 లక్షల మంది కాదు.. 19 లక్షల మందే!

లెక్క తేలింది.. 41 లక్షల మంది కాదు.. 19 లక్షల మందే!
X

లెక్క తేలింది. 41 లక్షల మంది కాదు, 19 లక్షల మందే అని తేల్చారు. వారందరినీ ఇప్పుడే దేశం నుంచి పంపించబోమని కూడా భరోసా ఇచ్చారు. ఐనప్పటికీ ప్రజల్లో ఆందోళన తొలగిపోవడం లేదు. ఎప్పుడేం జరుగు తుందో అని టెన్షన్ పడుతున్నారు. అసోంలో తాజా పరిస్థితి ఇది. దశాబ్దాల వివాదానికి తెర దించారు. స్థానికులెవరో..? స్థానికేతరులెవరో..? తేల్చేశారు. స్వదేశీయులెంతమంది..? విదేశీయులెంతమందో..? లెక్కలు కట్టారు. అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ఫైనల్ లిస్ట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అసోంలో మొత్తం 3 కోట్ల 29 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 3 కోట్ల 11 లక్షల మందిని భారత పౌరులుగా గుర్తించారు. మరో 19 లక్షల మందికి జాబితాలో చోటు లభించలేదు. NRCలో పేరు లేని వారిని విదేశీయులుగా గుర్తించనున్నారు.

NRC విడుదల అసోంలో ప్రకంపనలు రేపింది. జాబితాలో పేరుందో లేదో చెక్‌ చేసుకోవడానికి ప్రజలు పోటెత్తారు. నెటిజన్లంతా ఒక్కసారిగా పోటెత్తడంతో ఎన్‌ఆర్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ క్రాషైంది. జాబితా విడుదలైన పది నిమిషాలకే వెబ్‌సైట్‌ స్తంభించిపోయింది. మీసేవా కేంద్రాలలో ప్రస్తుతం సైట్‌ను చేరుకోలేం అని చూపించింది. దీంతో అనేకమంది NRCలో తమ పేరు ఉందో లేదో చూసుకోడానికి క్యూ లైనల్లో గంటల పాటు వేచి ఉన్నారు.

NRC ఫైనల్ లిస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబితాలో పేర్లు గల్లంతైనవారిలో ఎక్కువ మంది ముస్లింలు, అందులోనూ బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అసోం ప్రతిపక్ష నాయకుని పేరే, జాబితాలో గల్లంతైంది. ఆర్మీ అధికారి పేరు కూడా లేదు. జాబితాను తప్పుల తడకగా రూపొందించారని విపక్షాలు కస్సుమంటున్నాయి.

NRCలో పేరు లేని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. తమను భారతదేశం నుంచి పంపించేస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు. ఐతే, ఇప్పటికిప్పుడు విదేశీయులపై చర్యలు ఉండబోవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొ న్నాయి. లీగల్ ప్రక్రియ పూర్తైన తర్వాతే విదేశీయులపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. NRCలో పేరు లేని వాళ్లు, విదేశీయుల ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవాలని సూచించింది.

NRC విడుదల నేపథ్యంలో అసోంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 218 భద్రతా బలగాలను మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ కు విఙ్ఞప్తి చేశారు. ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం ఉంటుందని సూచించారు.

అసోంలో స్థానికుల గుర్తింపుపై 1951లోనే NRCని రూపొందించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లోకి వలసలు పెరిగాయి. దాంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య ఘర్షణలు జరిగాయి. సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌ గా పిలుచుకునే అస్సామీలు, NRCని సవరించాలంటూ ఆందోళనలు చేశారు. ఐతే, NRC సవరణ డిమాండ్‌పై గత ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. దాంతో గొడవలు ముదిరాయి. 1979లో ఆల్ అసోం స్టూడెంట్స్ ఫెడరేష న్, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థి సంఘంతో నాటి రాజీవ్ గాంధీ సర్కారు ఒప్పందం చేసుకుంది. ఆ డీల్ ప్రకారం, 1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్‌ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. ఒప్పందం కుదిరినప్పటికీ NRC సవరణ మాత్రం జరగలేదు.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత వచ్చిన వలసదారులను విదేశీయులుగా పరిగణించాలని తీర్మానించింది. 2016లో సిటిజన్‌షిప్‌ సవరణ చట్టం తీసుకొచ్చిన కేంద్రం, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్‌ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చింది. తాజాగా అసోంలోని భారత పౌరుల జాబితాను విడుదల చేసింది.

Tags

Next Story