రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి - ఉద్యోగ సంఘాలు

రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలి - ఉద్యోగ సంఘాలు
X

సీఎం కేసీఆర్‌ దోపిడీకి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సహకరిస్తున్నారని రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తప్పుడు ఒప్పందాల మీద ప్రభాకరరావు సంతకాలు చేస్తున్నారని గతంలో రేవంత్‌ రెడ్డి విమర్శించారు. అబద్దాలు ఆడుతున్న ప్రభాకర్‌రావును కాల్చినా తప్పులేదన్న వ్యాఖ్యలతో విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. తమ సిఎండీని తిట్టిన రేవంత్‌ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిష్టిబొమ్మనూ దగ్ధం చేశారు. అయితే ఉద్యోగులు రాజకీయ పార్టీలకు కొమ్ముకాయాల్సిన అవసరం ఏంటని రేవంత్‌ రెడ్డి ఎదురుదాడి చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎండీ ప్రభాకర్‌ రావు లేదా.. కేసీఆర్‌ సమాధానం ఇవ్వాలని.. ఉద్యోగులు కాదన్నారు రేవంత్‌ రెడ్డి. చిల్లర దందాలు చేసేవాళ్లు నా దిష్టిబొమ్మ తగలబెడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కంపెనీ సంక్షోభంలోపడితే నష్టపోయేది.. ఊడేది వారి ఉద్యోగాలన్నారు రేవంత్‌ రెడ్డి. తాను చేసిన ఆరోపణలకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు రేవంత్‌ రెడ్డి. విద్యుత్‌ రంగం అప్పులు 75వేల కోట్లుకు చేరాయని.. వడ్డీలే ఏడాదికి ఏడువేల కోట్లు కడుతున్నారన్నారు. వడ్డీ కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారని ఆరోపించారు.

అటు బీజేపీ నేతలను కూడా రేవంత్‌ రెడ్డి టార్గెట్‌ చేశారు. విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు. టీఆర్ఎస్‌- బీజేపీ ఒక్కటేనన్నారు. అందుకే లక్ష్మణ్‌ ముందుగా విచారణ డిమాండ్‌ చేసి.. తర్వాత సైలెంట్‌ అయ్యారన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే.. తన వెనక రావాలని.. ప్రధానమంత్రిని విచారణకు ఆదేశించాలని కోరదామన్నారు రేవంత్‌ రెడ్డి.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై టిఆర్ఎస్‌ నాయకులు మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికినా చిల్లర ఆరోపణలు చేస్తున్నారన్నారు. సిఎండి ప్రభాకర్‌రావు గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా శాఖలో పనిచేశారని గుర్తుచేశారు. ప్రభాకర్‌ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు.

అటు ఉద్యోగులు సైతం రేవంత్‌ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. తమ సంస్థను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని.. కంపెనీల్లో అవకతవకలు జరిగితే తామే నిలదీస్తామని.. ఎవరి అవసరం లేదన్నారు. తమ సంస్థ సిఎండీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి విద్యుత్‌ సంస్థలపై రేవంత్‌ ఆరోపణల ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

Tags

Next Story