నెల రోజులుగా నిద్రాహారాలు మానేసి పబ్జీ గేమ్ ఆడడంతో..

పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ కుర్రాడు ఏకంగా ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. తిండి, నిద్ర మానేసి ఆటలోనే మునిగిపోయి.. మానసికంగా దారుణమైన స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా కొడుకు పరిస్థితిని గుర్తించిన ఆ తల్లి వెంటనే ఆస్పత్రిలో చేర్చింది. నెల రోజులుగా పూర్తిగా పబ్జీ ఆడి ఆడి నీరసించిపోవడంతో.. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కుడి కాలు, కుడి చెయ్యి కదపలేని స్థితిలో ఉన్న ఆ కుర్రాడికి సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వనపర్తికి చెందిన 19 ఏళ్ల కేశవర్థన్ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. చదువులో ఫస్ట్ మార్కులే వచ్చేవి. స్నేహితుల ద్వారా పబ్‌జీ గురించి తెలుసుకున్నాక.. పూర్తిగా ఆ ఆటకు బానిసైపోయాడు. రాత్రీపగలూ అదే పనిలో ఉండడంతో నీరసించి డీహైడ్రేషన్ వచ్చేసింది. వాంతులు కూడా అవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. వారం రోజులు గడిచినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెదడుకు రక్తం సరఫరా చేసే నరాల్లో సమస్యలు గుర్తించిన న్యూరో ఫిజీషియన్‌లు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే పబ్జీ కారణంగా యువకులు, పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలా చూశాం. తాజా ఘటనతో మరోసారి ఈ గేమ్ ఎంత డేంజరో అంతా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టకపోతే కేశవర్థన్ పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం కచ్చితంగా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com