పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు

పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. అంతర్జాతీయ సదస్సులోనే పాక్ గాలి తీసేశారు భారత స్పీకర్, డిప్యూటీ స్పీకర్. కశ్మీర్ లో అణిచివేతను సహించలేకపోతున్నామన్న పాక్ ఆరోపణలకు అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు. పాక్ ఆరోపణలను రికార్డుల్లో లేకుండా తీసివేయించారు. దీంతో మరో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ చిన్నబోయినట్లైంది.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిడి తీసుకొచ్చేందుకు శాయశక్తులు ఒడ్డి కృషి చేస్తోంది. కానీ, పొరుగు దేశం కుప్పిగంతులుని భారత్ ఎప్పటికప్పుడు దీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. ఉగ్రదేశం అనే ముద్రతో పరువు తీసుకుంది. అయినా..బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ పదే పదే కశ్మీర్ అంశంతో మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ, మరో అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ అపహాస్యం పాలైంది.

మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాక్‌ ప్రతినిధి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. మాల్దీవుల పార్లమెంటు భవనం వేదికగా జరిగిన ఈ సదస్సుకు భారత్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ హాజరయ్యారు. పార్లమెంటులో సుస్థిరాభివృద్ధిపై చర్చ జరుగుతుండగా, పాకిస్థాన్‌ నుంచి హాజరైన ప్రతినిధి ఖాసిమ్‌ సూరీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీరీల అణచివేతను తాము సహించేది లేదని వ్యాఖ్యానించడంతో సభలో నిరసనలు మొదలయ్యాయి.

పాక్ వాదనను భారత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్‌ ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని భారత్‌ మండిపడింది. కశ్మీర్ పట్ల పాకిస్తాన్ అతి చొరవను ఖండిస్తూనే..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూడా అంతర్జాతీయ వేదికగా భారత్ ప్రస్తావించింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సదస్సు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉద్దేశించినదని, పాక్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. వెంటనే పాకిస్థాన్ మరో ప్రతినిధి ఖురాత్‌ ఉల్‌ ఐన్‌ మర్రి వాదనకు దిగడంతో ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మాల్దీవుల స్పీకర్‌ మహ్మద్‌ నషీద్‌ ఆమెను అడ్డుకున్నారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో పాటు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ మారణ హోమాన్ని కూడా అంతర్జాతీయ వేదికగా ఎండగట్టింది భారత్. చివరికి పాక్‌ లేవనెత్తిన అంశాలన్నీ రికార్డుల నుంచి తొలగిస్తామని మాల్దీవుల స్పీకర్‌ నషీద్‌ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story