కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల పోస్టర్ల కలకలం

జమ్మూకశ్మీర్‌లో నిషేధాజ్ణలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఇంకొన్ని రోజులు నిలిపేయక తప్పదని భారత ప్రభుత్వం పేర్కొంది. సాధారణ పౌరులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, ఉగ్రవాదులు-వేర్పాటువాదులకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దన్నదే తమ అభిమతమని స్పష్టం చేసింది. టెర్రరిస్టులు-సెపరేటిస్టులకు మధ్య కమ్యూనికేషన్ ఉండకూడదని, సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు చెలరేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చి చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ నాటకాలాడుతోందని విదేశాంగమంత్రి జై శంకర్ మండిపడ్డారు. ఉగ్రవాదులను లోయలోకి పంపా లన్నదే పాక్ పన్నాగమని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునేవరకు పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని పునరుద్ఘాటించారు.
ఆర్టికల్-370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ ఆంక్షలు విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ల్యాండ్ ఫోన్లకు కూడా ఆపేశారు. రెండు వారాల విరామం తర్వాత నిషేధాజ్ణలను కొద్దిగా సడలించారు. ల్యాండ్ ఫోన్లను పునరుద్ధరించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు కార్యాలయాలను ప్రారంభించారు. పరిస్థితి మళ్లీ గాడిలో పడుతున్న సమయంలో ఉగ్రవాదుల పోస్టర్లు కలకలం రేపాయి. స్కూళ్లు, ఆఫీసులు తెరిస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ కశ్మీర్ లోయలో పోస్టరు వెలిశాయి. దాంతో మళ్లీ ఆంక్షలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com