మంచి వరుడు రావాలని కోరుతూ..

ఆదిలాబాద్ జిల్లాలో తీజ్ వేడుకలు కలర్‌ఫుల్‌గా ముగిశాయి. అడవి బిడ్డల ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబించాయి. లంబాడా యువతులు తమకు మంచి వరుడు రావాలని దైవాన్ని కోరుతూ భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తొమ్మిది రోజులు అత్యంత నిష్టగా ఉపవాసాలు చేస్తారు. సజ్జరొట్టె, ఆకుకూరలతో ఒకే పూట ఆహారం తీసుకుంటూ పూజలు చేస్తారు. పండుగలో భాగంగా తొలుత పుట్ట మన్ను తీసుకొచ్చి వెదురు బుట్టలో దాన్ని వేసి అందులో గోదుమ మొలకలు పెంచుతారు. ఇవి ఎంత పచ్చగా ఉంటే భవిష్యత్ లో అంత ఆయురోగ్యాలు సంతోషాలు కలుగుతాయని వారి నమ్మకం. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఉయ్యాల ఊగడం తీజ్ పండుగలో ఓ సంప్రదాయం.
తీజ్ ఉత్సవాలు గ్రామపెద్ద ఇంటి ముందు నిర్వహించడం సంప్రదాయం. రాఖీ పౌర్ణమి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. చక్కని దుస్తులతో, యువతుల ఆటపాటలతో తొమ్మిది రోజులు తండాలు కొత్త కళ సంతరించుకుంటాయి. తామ అలికిన గోధుమ బుట్టలకు పసుపు నీరు చల్లుతూ తొమ్మిది రోజులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. 8వరోజు దమ్‌బోలి పండుగ నిర్వహిస్తారు. ఆరోజు ప్రతి ఇంటి నుంచి బియ్యం బెల్లం సేకరించి తీజ్ బుట్టల వద్ద ఉంచుతారు. అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తారు.
చివరరోజైన తొమ్మిదవ రోజు బుట్టల నుంచి మొలకలను వేరు చేసి పురుషుల తలపై పెడతారు. వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దేవుని వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మొలకలను సమీపంలోని బావులు, చెరువుల వద్దకు భాజా భజంత్రీల నడుమ పాటలు పాడుతూ తీసుకెళ్తారు. అక్కడే వాటిని నిమజ్జనం చేసి వెంట తెచ్చుకున్న రొట్టెలు ఆకుకూరలను ఆరగిస్తారు. యువతుల సోదరులు నీటితో వారి పాదాలు కడి నమస్కారాలు చేయడంతో తీజ్ పండుగ ముగుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com