ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ ప్రభావం మరో 3-4 రోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక.. హైదరాబాద్‌లో నిన్న(సోమవారం) భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, లకడీకపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. చాలా కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రోడ్లపై నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టింది. అటు.. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటి మట్టం గరిష్ట స్థాయి 513.41 మీటర్లకు చేరింది. GHMC అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్‌తో సహా వరంగల్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి చెరువు పొంగిపొర్లింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగాయి. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని జల్లేరు వాగు, ఎర్రకాల్వ, ఎద్దువాగు, జైహింద్ కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. జల్లేరు వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకల కోసం అప్రోచ్ రోడ్ నిర్మించారు. అయితే ఇది ఎప్పుడ కొట్టుకుపోతుందోనని స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పిడుగు హెచ్చరికలు జారీ చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com