సీఎం జగన్ ద్వారా నెరవేరబోతున్న దశాబ్దాల కల..

సీఎం జగన్ ద్వారా నెరవేరబోతున్న దశాబ్దాల కల..

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నియమించిన నిపుణుల కమిటీ... 90 రోజుల పాటు అధ్యయనం చేసి, నివేదికను నిన్న సీఎం జగన్ కు అందించింది. దీనిపై సీఎం... నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ విలీనానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వస్తారు. మరో వైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకురావాలని చెప్పారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు.

ఆర్టీసీ విలీనంతో ఏటా 3 వేల 300 కోట్ల నుంచి 3 వేల 500 కోట్ల వరకు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ భారాన్ని భరించేందుకు సీఎం జగన్ అంగీకరించారని మంత్రి పేర్ని నాని చెప్పారు. విధివిధానాలు త్వరలో ఖరారవుతాయన్నారు. ప్రభుత్వంలో విలీనం చేశాక ఆర్టీసీని లాభాల బాటలో పరుగెత్తించడమే కాకుండా దేశంలోనే నంబర్‌ వన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా నిలపాలని సీఎం సూచించారన్నారు. చాలా అంశాలపై అధ్యయనం జరిగాకే ముఖ్యమంత్రి.. ఆర్టీసీ విలీన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో అభద్రతా భావంతో ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగులు కావాలన్న వారి కల ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో నెరవేరబోతోందని తెలిపారు మంత్రి నాని.

Tags

Read MoreRead Less
Next Story