బర్త్‌డే కేక్‌లో విషం కలిపింది అతడే..!

అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు.. అన్న కొడుకుకు అండగా నిలవాల్సిన బాబాయి.. రాక్షసుడయ్యాడు.. ఆస్తి కోసం అన్న కుటుంబాన్నే అంతం చేయాలనుకున్నాడు. ఎనిమిదేళ్ల చిన్నారి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని పుట్టిన రోజునాడు ఆశీర్వదించాల్సిన అతడు మానవత్వం మరిచిపోయాడు. చిన్నారి నోటిని తీపి చేయాల్సిన కర్కోటకుడు.. కేకులో విషం కలిపి ప్రాణాలు తీశాడు.. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ దారుణం మానవత్వాన్ని మరోసారి ప్రశ్నించేలా చేసింది.

పుట్టిన రోజు అంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఏ ఇంట్లో అయినా చిన్నారి పుట్టిన రోజు జరుపుకుంటుంటే నిండు నూరేళ్లు హ్యాపీగా జీవించాలని అంతా కోరుకుంటారు. బంధువులు.. సన్నిహితులు.. పెద్దగా పరిచయం లేని వాళ్లు సైతం ఆశీర్వదిస్తారు. కానీ సొంత బాబాయి మాత్రం.. చిన్నారితో సహా అన్న కుటుంబాన్ని అంతం చేసేందుకు ప్లాన్‌ వేసి నరరూప రాక్షసుడయ్యాడు.

పుట్టినరోజు నాడు బాబాయి పంపించిన కేక్ వారి ప్రాణాలు తీసింది. కేక్‌ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్‌లో ఈ దారుణం జరిగింది.

ఐనాపూర్‌కు చెందిన 38 ఏళ్ల రవి, తన 8 ఏళ్ల కొడుకు రామ్‌చరణ్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకున్నాడు. ఈ వేడుకల కోసం రామ్‌చరణ్‌ బాబాయి కేక్‌ పంపించాడు. బాబాయ్‌ ప్రేమతో పంపించాడనుకుని ఆ కేక్ కట్ చేసి అందరికీ పంచాడు రామ్‌చరణ్‌. అయితే కేక్ తిన్న వెంటనే రాంచరణ్, రమేష్ అక్కడిక్కడే మృతి చెందారు. రమేష్ భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అన్నదమ్ములైన రవి, శ్రీనివాస్‌ మధ్య గతకొంతకాలంగా విరోధమున్నట్టు సమాచారం. శ్రీనివాసే కేక్‌ లో విషం పెట్టి పంపిచాడని రవి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story