యాదాద్రి ఆలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ముద్ర..

యాదాద్రి ఆలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ముద్ర..

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై .. తన చిత్రంతోపాటు టీఆర్‌ఎస్‌ గుర్తు కారును సైతం చెక్కించారు. వీటితోపాటు ప్రభుత్వ పథకాలైన కేసీఆర్‌ కిట్‌, తెలంగాణకు హరితహారం సైతం రాతి స్తంభాలపై కనిపిపిస్తున్నాయి. రాబోయే వెయ్యేళ్లపాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాలను రాతి స్తంభాలపై చెక్కుతున్నారు.

అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై సీఎం కేసీఆర్‌, కారుతో పాటు కేసీఆర్‌ కిట్‌, రాష్ట్ర అధికారిక చిహ్నం, చార్మినార్‌, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చెక్కుతున్నారు. చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను ఆలయాలపై చెక్కడం పూర్వీకుల సంప్రదాయం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు సీఎం కేసీఆర్‌. గుడిలో కృష్ణ శిలలపై నేటి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజకీయ అంశాలను కూడా చెక్కించారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరా వంటి నేతల చిత్రాలను చెక్కించారు.

ఈ చిత్రాలతో పాటు ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారు. అలాగే, బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు. ప్రాకార మండపానికి దక్షిణం వైపుగల రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్రను చెక్కుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story