శిలలపై కేసీఆర్‌ బొమ్మ, కారు గుర్తు.. భగ్గుమంటున్న ప్రతిపక్షాలు

శిలలపై కేసీఆర్‌ బొమ్మ, కారు గుర్తు.. భగ్గుమంటున్న ప్రతిపక్షాలు

యాదాద్రి గుడిలో శిలలపై సీఎం కేసీఆర్, కారు గుర్తులను చెక్కడాన్ని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో బీజేపీ కార్యకర్తలు శిల్పాలపై చెక్కిన ప్రతిమలను తొలగించి తీరుతారని హెచ్చరిస్తున్నారు. తానే యాదాద్రి వెళ్తానని ప్రకటించారు రాజాసింగ్. ఇంకా ఎవరెవరి ప్రతిమలు ఉన్నాయనేది పరిశీలించాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు రాజాసింగ్.

యాదాద్రి గుడిలో చార్మినార్ ప్రతిమ వేసి హిందువులను కించపరచారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని, హిందూ సంస్కృతి, సంప్రదాయలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని అభిప్రాయ పడ్డారు లక్ష్మణ్. ఆల‌య పిల్లర్లపై కేసీఆర్, కారు గుర్తులు ముద్రించ‌డంపై బీజేపీ నేత మాజీ మంత్రి అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ‌లు ఎంతో పవిత్రంగా భావించే దేవాలయంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఎలా ముద్రిస్తారని ప్రశ్నించారు. పవిత్ర మైన గుడిలో ప్రభుత్వ పథకాలు, మనుషుల ప్రతిమలు చెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాచరికంలో రాజులు ఇలాంటి పనులు చేసేవారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసారు. గుడితో ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. యాదాద్రి ఆలయంలో పిల్లర్లపై శిల్పాలు ఎవరి ఒత్తిడి తోను చెక్కలేదని వైటీడీఏ ప్రత్యేక అధికారి కిషన్ రావు తెలిపారు. శిల్పులు ప్రియమైన వారిగా భావించే వారిబొమ్మలు చెక్కడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రాకారంలో ఉన్న కేసీఆర్ శిల్పంపై వివాదాలు ఉంటే పునఃపరిశీలిస్తామన్నారు.

ఆలయప్రాకారాల్లో చరిత్ర చెప్పడం అనవాయితీగా వస్తుందోని ఆలయ స్తపతి వేలు తెలిపారు. యాదాద్రి ఆలయంలోనే చరిత్రను తెలిపే బొమ్మలు ఉన్నాయని.. ఆలయ శిల్పాలు చెక్కడంలో శిల్పులకు పూర్తిస్వేచ్ఛనిస్తామన్నారు. శిల్పాలు చెక్కే విషయంలో తమపై ఎవరి ప్రోద్బలం లేదన్నారు. యాదాద్రి శిలలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, కారు గుర్తు చెక్కడంపై పొలిటికల్‌ ఫైట్‌ పీక్ స్టేజ్ కు చేరింది. దీంతో అధికారులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. రాజకీయ రగడం ఆగడం లేదు. టిఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags

Next Story