రంగంలోకి అమిత్ షా.. ఏపీ టీడీపీ నేతలు భారీగా..

రంగంలోకి అమిత్ షా.. ఏపీ టీడీపీ నేతలు భారీగా..
X

అమిత్ షా కేంద్రం హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత... గతకొన్ని నెలలుగా ఏపీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినా ఫలితం లేకపోవడంతో ఇక ఆయనే రంగంలోకి దిగాలని భావించారు. ఏపీ బీజేపీ నేతలకు టైం ఇచ్చినా ఇప్పటివరకు టీడీపీ నేతలను బీజేపీలోకి తేకపోవడంతో ఇక అమిత్ షానే ఏపీలో పర్యటించనున్నారు. అక్టోబర్ నుంచి ఏపీలో ప్రతి నెలా ఒకరోజు పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాంతో పాటు ఫిబ్రవరి లోపు టిడిపి నేతలతో పాటు ఇతర పార్టీలనుంచి వచ్చే వారితో భారీ చేరికలు చేపట్టేలా అమిత్ షా ఏపీ పర్యటన ఉండబోతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సరిగ్గా ఏడాది క్రితం అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. అఫ్పటినుంచి పార్టీ బలోపేతం కన్నా గత ప్రభుత్వం పై విమర్శలు చేయడం.. ప్రస్తుత ప్రభుత్వం పై అదే రీతిలో వెళుతూ పార్టీ క్యాడర్ ను మాత్రం తయారు చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ లోంచి బీజేపీ లో చేరేవారి చిట్టా ఉన్నప్పటికి ఎందుకు ఇంత సమయం పడుతోందంటూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో కన్నా కు అక్షింతలు కూడా వేశారు. పార్టీని ఇంకా ఇలా వదిలేస్తే 2024 కి కూడా ఇదే పరిస్ధితి ఉంటుందంటూ అధిష్టానం సీరియస్ గా ఉంది. అందుకే అమిత్ షా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు నెలలో ఒకటి లేదా రెండు రోజులు ఏపీలో పర్యటన చేసి ఎంతమంది పార్టీలో చేరుతారో వారందరినీ లాగేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే విషయంలో బీజేపీ నేతలకు సమాచారం ఆందింది. ఎవరెవరు ఉన్నారో లిస్ట్అవుట్ చేయమని ఆదేశాలు అందాయి. ఈ నేపధ్యంలోనే అమిత్ షా పర్యటనలోనే అందర్నీ పార్టీలో చేర్పించి బీజేపీలో నూతనోత్సాహాన్నినింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన కోర్ కమిటీ లో అమిత్ షా పర్యటన ఎలా ఉండాలి.. ఎక్కడెక్కడ వలసలు ఎక్కువుగా ఉండవచ్చో ఆయా ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే అమిత్ షా పర్యటన బీజేపీ లో నూతనోత్సాహాన్ని నింపడం ఖాయమని బీజేపీలోని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. వలసలే ప్రధానంగా అమిత్ షా పర్యటన ఉండబోతుందని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ అమిత్ షా పర్యటనతో బీజేపీలోకి చేరికలు ఉంటాయో లేదో తెలియదు కాని టీడీపీలో మాత్రం టెన్షన్ మొదలైంది. అయితే బీజేపీ బలోపేతమా...పర్యటనలతో అమిత్ షా మమా అనిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Tags

Next Story