రాత్రి పగలూ తేడా లేకుండా యూరియా కోసం రైతన్న పడిగాపులు

రాత్రి పగలూ తేడా లేకుండా యూరియా కోసం రైతన్న పడిగాపులు

తెలంగాణవ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు పంటలు బతికించుకోవడానికి నానాకష్టాలు పడ్తున్నారు. ఫెర్టిలైజర్ షాపుల ముందు, సహకార సంఘాల ముందు బారులు తీరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రాత్రి పగలూ తేడా లేకుండా రైతులంతా సహకార సంఘాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణతో అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా ఇంధవాయి మండల కేంద్రంలో త్రియంబక్‌పేట గ్రామానికి చెందిన శోభ అనే మహిళా రైతు కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

యూరియా లారీ వస్తుందని తెల్లవారుజామున సమాచారం తెలియడంతో.. హుటాహుటిన సొసైటీ వద్దకు వెళ్లిన శోభ అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఈ సహకార సంఘం పరిధిలో 7 గ్రామాలు ఉండడంతో దాదాపు వెయ్యి మంది రైతులు తరలివచ్చారు. భారీ సంఖ్యలో అన్నదాతలు అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వచ్చే యూరియా అరకొరగా ఉండడం.. రైతులు ఎరువుల కోసం ఎగబడుతుండడంతో ప్రతిచోటా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి.

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని రైతులు అడ్డుకున్నారు. ముందు తమకే ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పైనే ధర్నా చేశారు. వనపల్లికి వెళ్తున్న లారీని ఆపేయడంతో.. వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వీలైనంత త్వరగా ఎరువులు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు.. తీరా పంటల సాగుకు వచ్చేసరికి అన్నదాతను దగా చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తగినంత యూరియా సరఫరా చేసి, పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story