విక్రమ్ ల్యాండర్‌ ముక్కలు కాలేదు.. సేఫ్‌

చంద్రయాన్-2 మిషన్‌లో మరో పురోగతి లభించింది. విక్రమ్ ల్యాండర్‌ సేఫ్‌గానే ఉంది. ల్యాండర్‌ ముక్క లు కాలేదని, సింగిల్ పీస్‌గానే ఉందని ఇస్రో ప్రకటించింది. నిర్దేశిత ప్రాంతానికి సమీపంలో ల్యాండర్ ఓ పక్కకు ఒరిగి ఉందని ఇస్రో పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా విక్రమ్ లోపలే ఉందని తెలిపింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవడాని కి ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐతే, ల్యాండర్‌లో అన్ని వ్యవస్థలు సరిగా ఉన్నాయా లేదా అన్నది ఇస్రోను టెన్షన్‌ పెడుతోంది. విద్యుత్, సమాచార వ్యవస్థలు పని చేస్తున్నాయా లేదా అన్నది క్లారిటీ లేదు. సిస్టమ్ మొత్తం క్షేమంగా ఉంటే కమ్యూనికేషన్ కుదురుతుందని ఇస్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వాస్తవానికి విక్రమ్ ల్యాండర్, చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ లాండింగ్ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు తలెత్తి ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ కావడంతో హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. దాంతో ల్యాండర్‌ ముక్కలు చెక్కలై ఉంటుందని భయపడ్డారు. ఐతే, సైంటిస్టుల ఆందోళనకు తెరదించుతూ విక్రమ్ ల్యాండర్ సేఫ్‌ గా ఉన్నట్లు సమాచారం అందింది.

గత శనివారం తెల్లవారుజామున విక్రమ్ ల్యాండర్‌, చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఊహించని అవాంతరం ఏర్పడడంతో ల్యాండర్‌తో ఇస్రోకు సంకేతాలు తెగిపోయాయి. అది ఎక్కడ ఉందో..? ఎలా ఉందో..? ఇస్రో శాస్త్రవేత్తలకు వెంటనే అర్థం కాలేదు. ఐతే, చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్, ల్యాండర్ జాడను కనిపెట్టింది. విక్రమ్‌ థర్మల్ ఇమేజ్‌లను తీసి ఇస్రోకు పంపింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story